NTV Telugu Site icon

Loksabha Result 2024: రేపే ఎన్నికల కౌంటింగ్.. నేడు ఈసీ కీలక ప్రెస్‌మీట్

Election Commission

Election Commission

Loksabha Result 2024: దేశంలో 7 దశలలో జరిగిన లోక్ సభ ఎన్నికలు-2024తో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ రేపు(మంగళవారం) జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికల (లోక్‌సభ ఫలితాలు 2024) కౌంటింగ్‌కు ఒక రోజు ముందు ఎన్నికల సంఘం సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించడం బహుశా ఇదే తొలిసారి. 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుందని ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఆహ్వానంలో పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల వరకు, ప్రతి దశ ఓటింగ్ తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశాలను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి పలికారు. లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగిశాయి.

Read Also: TG Polycet Results: నేడు పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

అదే సమయంలో, జూన్ 4న లోక్‌సభ ఫలితాలు వెలువడే ముందు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌ల నుంచి ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులందరికీ లిఖితపూర్వక సలహాను జారీ చేసింది. అలాగే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉప ఎన్నికలకు సంబంధించిన సూచనలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్‌సభ స్థానాలకు రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే కీలకమైన సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు), వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి అనుసరించాల్సిన ప్రక్రియపై సూచనలు చేసింది.