NTV Telugu Site icon

Telangana Elections 2023 : మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలను నిలిపివేసిన ఈసీ

Election Commission

Election Commission

ఎన్నికల ప్రచారానికి ఉద్దేశించిన ప్రకటనలలో, ముందుగా అనుమతి మంజూరు చేసిన వాటిలో కొన్నింటిని ఉపసంహరించుకోవడానికి కారణం – వాటిలోని అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులు, రాజకీయ పార్టీలు వక్రీకరణకు గురిచేసారనీ, దుర్వినియోగపరిచారని భావించడంవల్లనే – అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పష్టం చేసింది.

పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన కొన్ని ప్రకటనలను ఉపసంహరించుకోవడానికి సంబంధించి పత్రికలు, ప్రసారసాధనాల్లో వచ్చిన కథనాలను దృష్టిలో ఉంచుకుని వాటిపై స్పష్టతనిస్తూ, అక్టోబరు 9నుండి ఇప్పటివరకు దాదాపు 416 కు పైగా ప్రకటనలకు అనుమతులివ్వగా, వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చి(మార్ఫింగ్), వక్రీకరించి, తప్పుగా అన్వయించడం వంటివి చేయడం జరిగింది.

అనుమతి నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా దుర్వినియోగపరచడం జరిగిందనీ తెలుసుకున్న తరువాత వాటిలో 15 ప్రకటనలకు అనుమతులను ఉపసంహరించడం జరిగింది.

తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ప్రకటించిన తరువాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం- రాజకీయ పార్టీలు ప్రచార నిమిత్తం ఉపయోగించుకునే ప్రకటనలకు రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. వాటినే యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

అదీగాక, రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్ తో పాటూ అటువంటి ఇతర వేదికలలో కూడా ప్రసారం చేస్తున్నట్లు ఎన్నిక సంఘం దృష్టికి వచ్చింది. దీనిని కూడా స్పష్టంగా నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించడం జరుగుతుంది.

ఎన్నికల ప్రచార నిమిత్తం వాడుకునే ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం నవంబరు 8,9,10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలను నిర్వహించి, దానికి హాజరయిన ప్రతినిధులకు ప్రచార, ప్రసార అనుమతి (ధృవీకరణ/సర్టిఫికేషన్) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది.

సామాజిక మాథ్యమాలతో సహా పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియాలవంటి పలు వేదికల మీద వినియోగించుకోవడం లేదా దుర్వినియోగపరచడం, అటువంటి సందర్భాల్లో తలెత్తే సమస్యలను కూడా వారికి వివరించడం జరిగింది. నియమావళిని ఉల్లంఘించిన సందర్భాల్లో, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ధృవీకరణ అనుమతిని ఉపసంహరించుకోవడం జరుగుతుందని కూడా వారికి తెలియపరచడం జరిగింది.

అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరు కావడమే కాక మార్గదర్శకాలను అనుసరిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది.

రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ఎలక్ట్రానిక్ మీడియా(టీవీ ఛానళ్ళు వాటిలోని అంశాలను, అనుమతి ధృవీకరణ పొందిన ప్రకటనలతో సరిచూచుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరుతున్నది.

ఇలా సరిచూచుకోవడానికి ఎన్నికల సంఘం కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్(సమాచార ప్రసార విభాగ)దగ్గర అనుమతి పొందిన ప్రకటనలు అందుబాటులో ఉంటాయి. మీడియాకు సంబంధించిన ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజకీయ పార్టీలు విడుదల చేసే ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతి ధృవీకరణ ఇవ్వడం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థిఅయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధృవీకరణకోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.