Site icon NTV Telugu

Election Commission: ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల కోడ్‌ వర్తింపు.. స్పష్టం చేసిన ఈసీ

Cec

Cec

Election Commission: ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్‌ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందుతున్న వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని పేర్కొంది.. దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తెలిపింది. అయితే, ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచార రంగంలోకి ప్రవేశిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి.. ఇక, ప్రభుత్వ సలహాదారుల హోదాలో ఉండి.. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీంతో, మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏ మాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తాం. సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Read Also: April Born Kids Traits: ఏప్రిల్‌లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

కాగా, ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం మరియు ఒడిశా అసెంబ్లీల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించిన విషయం విదితమే.. ఇక, మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి.. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం తారాస్థాయికి చేరుకుంది.

Exit mobile version