Site icon NTV Telugu

Bathukamma After Dasara: ఇక్కడ దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ.. ఎక్కడో తెలుసా?

Bathukamm

Bathukamm

Bathukamma After Dasara: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ పండగ జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసా.. ఎందుకని అక్కడి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దానికి భిన్నంగా.. ముందు దసరా పండగ జరిపిన తర్వాత సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Chris Woakes: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం భిన్నం..
రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండగ తర్వాత దసరా నిర్వహిస్తుంటే నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం ఏటా దసరా అనంతరం సద్దుల బతుకమ్మ పండగ జరుగుతుంది. ఇక్కడి ప్రజలు ఏటా దసరా అనంతరం పౌర్ణమికి ముందు మంచి రోజు చూసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సద్దుల బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. ఇది వాళ్లకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్థులు ఈ ఆచారానికి వెనక ప్రచారంలో ఉన్న రెండు కథలను చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు నిజాం పరిపాలించారు. ఆ సమయంలో ఉన్న దేశముఖ్ పాలనలో గ్రామస్థులు గడి వద్దనే తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకునేవారు. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మ పండగ జరిగేది. అయితే ఒక ఏట నిర్వహించిన పండగలో సద్దుల బతుకమ్మ రోజు దేశముఖ్ సిపాయి తుపాకీ పెల్చే యత్నంలో పొరపాటున మిస్ ఫైర్​ అయి సిపాయి మృతి చెందాడు. దీంతో మృతి ముట్టుడుగా (అరిష్టంగా) భావించి నాటి నుంచి బతుకమ్మ పండుగ దసరాకు ముందు జరపడంలేదు. దసరా తర్వాత పార్ణమికి ముందు మంచి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం ప్రారంభించారు. నాటి నుంచి ఆ ఆనవాయితీ అలాగే వస్తుందనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇంటి ఆడపడుచులు దసరా పండగకి అత్త వారింట్లో ఉంటారు. దసరాకు ముందు పండగ జరిపితే ఆడపడుచులు అత్తవారింటి నుంచి వచ్చే వీలుండదు. దీంతో దసరా తరువాత బతుకమ్మ పండగ నిర్వహిస్తే తమ ఇంటి ఆడబిడ్డలు అందరితో కలిసి పండగని ఘనంగా నిర్వహించుకోవచ్చనే ఉద్దేశ్యంతో దసరా తరువాత బతుకమ్మ జరుపుకుంటారనే కథ ప్రచారంలో ఉంది.

పెద్ద బతుకమ్మల కోసం గ్రామస్థుల పోటీ..
ఎడపల్లిలో జరిగే బతుకమ్మ పండగ కోసం గ్రామస్థులు 20 రోజుల ముందు నుంచే గునగ పువ్వు సేకరణలో నిమగ్నమవుతారు. గునగపువ్వుతో పెద్దపెద్ద పువ్వు బతుకమ్మలు తయారు చేయడానికి పోటీ పడుతుంటారు. దీని కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి ఈ పూలు సేకరిస్తారు. గునగపూల బతుకమ్మలే ఈ పండగలో ప్రధాన ఆకర్షణ. నిలువెత్తు బతుకమ్మలను చేయడానికి గ్రామస్థులందరూ పోటీపడతారు. భారీ బతుకమ్మలను తయారు చేయడంతో మగవాళ్లే వాటిని నిమజ్జనానికి మోసుకెళ్తారు. రెండు కిలోమీటర్లు దూరం ఉన్న దేశ్​ముఖ్​ గడి నుంచి స్థానిక బతుకమ్మ చెరువు వరకు బతుకమ్మలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి బతుకమ్మలు తరలించే క్రమంలో మొదటి బతుకమ్మ చెరువు వద్ద వుంటే చివరి బతుకమ్మ గ్రామంలోని దేశ్​ముఖ్​ గడీ వద్ద ఉంటుంది. ఈ వేడుకలను చూడడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండగ ఈ రోజుతో అయిపోతే ఎడపల్లిలో మాత్రం దసరా తర్వాత అంగరంగ వైభవంగా జరగనుంది.

READ ALSO: Bathukamma Guinness Record: తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు

Exit mobile version