ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!

Ys Avinash Reddy Ed

Ys Avinash Reddy Ed

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో భాగంగా కడప, హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విల్లాలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాలు జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, నగదు చెల్లింపులపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా హవాలా మార్గంలో డబ్బులు చెల్లించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో కలిపి.. మొత్తం 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.