ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మెరుపు దాడులు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మోసాలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
అధిక లాభాలు వస్తాయంటూ సామాన్యులను ఆకర్షించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్రాష్ట్ర ముఠాల కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. గత వారం ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో లభించిన సమాచారం, లింకుల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై తాజాగా సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. బెట్టింగ్, మోసపూరిత యాప్‌ల ద్వారా సమీకరించిన సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో కీలక అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో నగదు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు, హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర ఆస్తులు లేదా పత్రాలకు సంబంధించి ఈడీ నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

