NTV Telugu Site icon

Kejriwal: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసు.. హాజరుపై ఉత్కంఠ!

Kejriwal

Kejriwal

లిక్కర్ పాలసీ కేసులో (Liquor Policy Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు (Delhi CM Arvind Kejriwal) మరోసారి ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఇలా దాదాపుగా ఐదుసార్లు విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా విచారణకు కేజ్రీవాల్ సహకరించాలని తెలిపింది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఇంతకుముందు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. తాజాగా మరోసారి బుధవారం(14-02-2024) నోటీసులు ఇచ్చింది.

సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ (Enforcement Directorate) నోటీసులు ఇవ్వడాన్ని ఆప్ తప్పుపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఈడీని బీజేపీ అడ్డంపెట్టుకుని వేధిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. తాజా నోటీసుపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆరోసారి కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొడతారా? లేదంటే హాజరవుతారా? అన్నది వేచి తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. కొన్ని నెలల నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇటీవల వివాహ కార్యక్రమం నిమిత్తం మాత్రం తాత్కాలిక బెయిల్‌ను సిసోడియాకు మంజూరు చేసింది.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కూడా జైల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.