ECI Voter Registration Form 6: ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటు నమోదు కోసం సమర్పించే ఫారం 6 (Form 6) నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డిక్లరేషన్‌ను ఈసీ పూర్తిగా వేరు (De-link) చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, అన్ని రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇకపై ఓటర్ జాబితా (Electoral Roll) లో పేరు చేర్చుకోవాలనుకునే పౌరులు ఆన్‌లైన్ ఫారం 6 నింపేటప్పుడు ఈ డిక్లరేషన్‌ను జత చేయాల్సిన అవసరం ఉండదు, దానిని విడిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఎలక్షన్ కమిషన్‌లో పారదర్శకత పెంచడానికి, నిర్ణయాల ప్రక్రియను సులభతరం చేయడానికి తీసుకుంటున్న అనేక కొత్త మార్పుల్లో భాగమే ఈ నిర్ణయమని ఈజీ స్పష్టం చేసింది. అంతర్గత నిర్వహణకు సంబంధించి ఈసీ మరికొన్ని ప్రాధాన్యమైన మార్పులను కూడా తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా ఈసీ అధికారుల సమావేశాలు నిర్వహించే విధానంలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇకపై సమావేశాల అజెండాను ముందుగానే సభ్యులకు పంపుతారు. అలాగే మీటింగ్ ముగిశాక అధికారికంగా మినిట్స్ కూడా జారీ చేస్తారు. గతంలో ఈ పద్ధతి అమలులో ఉండేది కాదు. అలాగే ఈసీ అధికారుల విదేశీ పర్యటనల నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు విదేశాలకు వెళ్లాల్సి వస్తే ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. గతంలో ఈ రకమైన అనుమతి తీసుకునే విధానం ఉండేది కాదు.
మరోవైపు కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మోడ్యూళ్ల అభివృద్ధి ప్రక్రియలో కూడా కీలక మార్పు తీసుకొచ్చారు. గతంలో కొత్త ఐటీ మోడ్యూళ్ల ఆమోదం (IT Module Approval) విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC), ఎలక్షన్ కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు ఉండేవి. అందుకే ఈ ప్రక్రియను మరింత పటిష్టం చేస్తూ, కొత్త ఐటీ మోడ్యూళ్ల ప్రతిపాదనలను నేరుగా కమిషన్ ముందుకు కాకుండా, ముందుగా ఒక ప్రత్యేక కమిటీకి పంపుతారు. అక్కడ పూర్తి స్థాయి పరిశీలన పూర్తయిన తర్వాతే తుది పరిశీలన కోసం ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకొస్తారు.

