Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Poha

Poha

Poha: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల పులిహోర (పోహా) బెస్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నిమ్మరసం పులుపు, తాలింపు సువాసన, వేరుశెనగలు, జీడిపప్పు కరకరలతో ఈ అటుకుల పులిహోర మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

* మందపాటి అటుకులు – 4 కప్పులు
* నూనె – 3 టేబుల్ స్పూన్లు
* వేరుశెనగ గింజలు – 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* మినప్పప్పు – 1 టీ స్పూన్
* శెనగపప్పు – 1 టీ స్పూన్
* పచ్చిమిర్చి – 4 (పొడవుగా చీల్చినవి)
* కరివేపాకు – కొద్దిగా
* పసుపు – ½ టీ స్పూన్
* ఉప్పు – తగినంత
* నిమ్మకాయలు – 2 పెద్దవి లేదా 3 చిన్నవి
* కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
* నీరు – అవసరమైనంత

తయారీ విధానం:

ముందుగా ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల మందపాటి అటుకులు వేసుకోవాలి. పల్చటి అటుకులు ఉపయోగిస్తే అవి త్వరగా మెత్తబడి ముద్దలా మారిపోతాయి కాబట్టి.. మందపాటి అటుకులనే తీసుకోవడం మంచిది. ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీరు పోసి చేత్తో ఒకసారి బాగా కలిపి వెంటనే నీటిని పూర్తిగా వంపేయాలి. అటుకులను ఎక్కువసేపు నీటిలో నాననివ్వకూడదు. నీరు వంపిన తర్వాత వాటిని కొద్దిసేపు పొడిగా ఉంచాలి.

తర్వాత ఒక పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో ముందుగా వేరుశెనగ గింజలు, జీడిపప్పు వేసి స్వల్పంగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు ఒక్కో టీ స్పూన్ చొప్పున వేసి బాగా వేగనివ్వాలి. అనంతరం పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అటుకులను పాన్‌లో వేసి తాలింపు మొత్తం బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. తగినంత ఉప్పు వేసి సిమ్ మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి.

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు పెద్ద నిమ్మకాయల లేదా మూడు చిన్న నిమ్మకాయల రసాన్ని పిండాలి. నిమ్మరసం వేసిన తర్వాత మరోసారి మెల్లగా కలిపి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. ఈ అటుకుల పులిహోరను వేడివేడిగా కొబ్బరి పచ్చడి, పెరుగు లేదా ఆలూ కూరతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీతో సుమారు నలుగురికి సరిపడా అటుకుల పులిహోర తయారవుతుంది. తక్కువ సమయంలో రుచికరమైన, తేలికైన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక.