NTV Telugu Site icon

OTR : తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో వర్గపోరు..శృతిమించుతున్న గొడవలు

Tdp

Tdp

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీని గాడిలో పెట్టాలనే ప్రయత్నాలు వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయి. ఈ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. గత ఎన్నికల్లో రెండింటిని టీడీపీ గెలుచుకుంది. రాజమండ్రి అర్బన్‌లో ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలిచారు. ఇవే చివరి ఎన్నికలు ఇక పోటీ చేయబోనన్న గోరంట్ల మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని అధిష్ఠానం ప్రకటించడంతో ఈ రెండు చోట్లా స్పష్టత ఇచ్చినట్టు అయ్యింది. మిగిలిన అయిదుచోట్ల మార్పులు, చేర్పులు ఉంటాయని సమాచారం.

Also Read :Boinapalli Vinod Kumar : ఓయూ సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

నిడదవోలులో పోటీ చేయబోనని చెప్పిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పత్తా లేకుండా పోయిన ఆయన తీరు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న నేతలకు రుచించడం లేదట. మూడేళ్లుగా టికెట్‌పై ఆశలు పెంచుకున్న నేతలు గుర్రుగా ఉండటంతో ఇక్కడ టీడీపీ రాజకీయం వాడీవేడీగా ఉంది. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ.. ఆ సెగ్మెంట్‌లో నేతలే తప్ప కార్యకర్తలు కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీకి ద్వితీయ శ్రేణి నేతలు ఎవరూ లేకపోవడంతో కత్తిమీద సాములా మారింది పార్టీ నేతల పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా లోకల్‌గా టీడీపీకి ఆయనే ఏక్‌ నిరంజన్‌.
Also Read : IT and ED Raids in Telangana: తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్‌.. ఈడీ తదుపరి టార్గెట్‌ ఎవరు?

కొవ్వూరు, గోపాలపురం, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల తీరు రొటీన్‌కు భిన్నంగా ఉంది. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు నాయకులు. కొవ్వూరులో మాజీ మంత్రి KS జవహర్‌, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లను.. వారి నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్‌ పదవుల నుంచి పక్కన పెట్టారు. కొవ్వూరులో ప్రస్తుతం టుమెన్‌ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పచ్చగడ్డే భగ్గుమనేలా విభేదాలు పీక్స్‌కు వెళ్లాయి.

గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును కాదని .. పార్టీ నేత వెంకట్రాజుకు ఇంఛార్జ్‌గా టీడీపీ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం రెండు వర్గాలు సైలెంట్‌గా ఉన్నా.. తెర వెనుక కత్తులు నూరుతున్నట్టు సమాచారం. ఏదోక రోజున రోడ్డున పడతారనే ఆందోళన తెలుగు తమ్ముళ్లలో ఉందట. రాజానగరంలో వెంకటేష్‌కు బ్రేక్‌ వేసినా.. ఇక్కడ ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం నుంచి బలమైన నేత కోసం పార్టీ పెద్దలు అన్వేషిస్తున్నారట.

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కొత్త చిక్కులు

పాత నేతలను తొలగించడంతో నియోజకవర్గంలో టీడీపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే ఆందోళన కేడర్‌లో ఉందట. నాడు వాడుకుని నేడు వదిలేశారనే కామెంట్స్‌ దేశం శిబిరంలో వినిపిస్తున్నాయట. ఈ సంగతులన్నీ తెలిసినా టీడీపీ అధిష్ఠానం మౌనంగా ఉండటమే శ్రేణులకు అంతుచిక్కడం లేదట.