దుబాయ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఎడారి దేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా రెండు రోజుల పాటు స్కూల్లకు కూడా సెలవులు ప్రకటించారు.
ఏప్రిల్ నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అంచనా వేసింది. అయినా కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక మే 3న వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Monditoka Jaganmohan Rao: మా పథకాలనే టీడీపీ కాపీ కొట్టింది..
