Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో చారిత్రక విజయం తర్వాత టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మహిళా జట్టు ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా మహిళా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వారియర్. ఈ జట్టులో ఒక డీఎస్పీ కూడా ఉన్నారని మీలో ఎంత మందికి తెలుసు. ఇంతకీ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆమె మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ. ఆమె ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి 22 వికెట్లు తీసి వార్తల్లో నిలిచారు. ఆమె ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో ఐదు వికెట్లు పడగొట్టడమే కాకుండా అర్ధ సెంచరీ కూడా చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీ రోల్ ప్లే చేసింది. ఈ స్టోరీలో ఆమె కథను తెలుసుకుందాం..
READ ALSO: Women’s World Cup Final: ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!
ఆగ్రా నుంచి ప్రయాణం..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని శంషాబాద్‌లో ఆగస్టు 24, 1997న దీప్తి శర్మ జన్మించింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ రైల్వేస్‌లో పనిచేసే వారు. ఆమె తల్లి సుశీల శర్మ పాఠశాల ప్రిన్సిపాల్. ఆమెకు నలుగురు అన్నలు ఉన్నారు. వారిలో చిన్నవాడు సుమిత్ శర్మ.. ఈయన ఉత్తరప్రదేశ్ తరఫున ఫాస్ట్ బౌలర్‌గా ఆడాడు. దీప్తి ఎనిమిదేళ్ల వయసులో తన సోదరుడు సుమిత్‌తో కలిసి నెట్స్‌లో ఆడుతూ క్రికెట్ ప్రపంచంలోకి తొలిసారిగా అడుగుపెట్టింది. ఒకరోజు భారత మాజీ బ్యాట్స్‌మెన్ హేమలత కాలా దీప్తి త్రోను చూసి వెంటనే “ఈ అమ్మాయికి ఏదో ప్రత్యేకత ఉంది” అని గుర్తించింది. ఆ తర్వాత దీప్తి శిక్షణ ఇక్కడే ప్రారంభమైంది. ప్రారంభంలో దీప్తి వేగంగా బౌలింగ్ చేసింది, కానీ ఆమె సోదరుడు సుమిత్ స్పిన్నర్‌గా మారడం మంచిదని ఆమెను ఒప్పించాడు. ఇది ఆమెకు గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అలాగే ఆల్ రౌండర్‌గా మారడానికి మంచి ఛాన్స్ కల్పిస్తుందని చెప్పాడు. అనంతరం సుమిత్ తన MBA పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని కూడా వదులుకుని రెండేళ్ల పాటు రోజూ దీప్తితో ప్రాక్టీస్ చేయించేవాడు. దీని ఫలితంగా దీప్తి 12 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్ అండర్-19 జట్టుకు ఎంపికైంది.
17 ఏళ్ల వయసులో టీమిండియాలోకి..
2014లో కేవలం 17 ఏళ్ల వయసులో దీప్తి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆమె దక్షిణాఫ్రికాతో తన తొలి వన్డే ఆడింది. ఆ తర్వాత 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన T20Iలో అరంగేట్రం, 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనమ్ రౌత్‌తో కలిసి 320 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి దీప్తి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఇది మహిళల ODIలలో ప్రపంచ రికార్డు. ఆ మ్యాచ్‌లో దీప్తి 188 పరుగులు చేసింది. ఇది మహిళల ODIలలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంకా 20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డుకెక్కింది. WPL 2023లో UP వారియర్స్ తరపున ఆడుతూ, హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఆమె చరిత్ర సృష్టించింది. హ్యాట్రిక్ సాధించిన మొదటి భారతీయ బౌలర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 2024 T20 సిరీస్‌లో 30 వికెట్లు పడగొట్టి, ఇప్పుడు 2025 ప్రపంచ కప్‌లో 22 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 5 వికెట్లు పడగొట్టి, అర్ధ సెంచరీ నమోదు చేసి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందజేసింది.
DSP దీప్తి శర్మ..
ఈ విజయాలన్నింటికీ దీప్తి 2020లో అర్జున అవార్డును అందుకుంది. 2023 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నందుకు, యూపీ ప్రభుత్వం రూ.3 కోట్ల రివార్డును, 2024 జనవరిలో డిఎస్పీ పదవిని ప్రకటించింది. 2025లో మొరాదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు యూనిఫాంను బహుకరించారు. దీప్తి తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్, ప్రశాంత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డీఎస్పీ తర్వాత దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. “ఈ గౌరవంతో నేను ఉప్పొంగిపోయాను. నాకు మద్దతు ఇచ్చినందుకు నా కుటుంబం, యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను నా డిఎస్పీ విధులను పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తాను” అని పోస్ట్ వెల్లడించారు. డీఎస్పీగా ఆమెకు అందే జీతం గురించి చూస్తే.. నెలకు రూ. 56,100 (లెవల్-10) వస్తుంది. దీనితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలిపి జీతం రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. దీప్తి హనుమంతుడికి గొప్ప భక్తురాలు కావడం గమనార్హం. ఆమె చేతిలో హనుమంతుడి బొమ్మ ఉన్న రెండు టాటూలు ఉన్నాయి. మొత్తం 230 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దీప్తి ఇప్పుడు క్రికెటర్ మాత్రమే కాదు, యూపీ పోలీస్ విభాగంలో డీఎస్పీ కూడా.
READ ALSO: Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్
