గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.
జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా విశాఖలోని మూడు లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని కార్మికులు నిలిపివేశారు. దాంతో ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయ్యాయి. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పడుతుంది.
Also Read: Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి!
జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఇవాళ మరోసారి మేయర్ చర్చలకు పిలిచారు. ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకుంటే కార్మికులు సమ్మెను కొనసాగించనున్నారు. ఇదే జరిగితే నగర వాసులకు సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మంచినీరు రాకపోవడంతో వేరే గత్యంతరం లేక బోరింగ్ల వద్ద క్యూలు కడుతున్నారు. అవి కూడా బురద రంగులో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అజనాలు కోరుతున్నారు.
