Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్‌లో యూఎఫ్‌సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రత్యేకంగా యూఎఫ్‌సీ (UFC) ఫైట్ నైట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్రంప్ 80వ జన్మదిన వేడుకలతో కూడా కలిసి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ పరిపాలనకు చెందిన కీలక నాయకులు, మద్దతుదారులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు.

కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ (Melania Trump) అధ్యక్షుడి పక్కనే కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. వారి వెనుక ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) కూడా ఉన్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఇవాంకా ట్రంప్, టిఫనీ ట్రంప్‌తో పాటు వారి జీవిత భాగస్వాములు కూడా రింగ్‌సైడ్‌లో సందడి చేశారు. ట్రంప్ మనవలు, మనవరాళ్లు కూడా ఈ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

×
×
Ad

అయితే ఈ కార్యక్రమానికి మద్దతుతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ట్రంప్ అనుచరులు భారీగా తరలివచ్చి ఫైట్ నైట్‌ను ఉత్సాహంగా ఆస్వాదించగా.. విమర్శకులు, కొందరు రిపబ్లికన్ నేతలు ఈ కార్యక్రమంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైట్ హౌస్ వెలుపల నిరసనకారులు ఆందోళనలు చేపట్టగా.. మరోవైపు అభిమానులు ఫ్యాన్ జోన్లలోకి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మూడో ఫైట్ ముగిసిన అనంతరం ప్రేక్షకుల్లో కొందరు ట్రంప్‌కు “హ్యాపీ బర్త్‌డే” పాట పాడి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా మారింది.

ఇదిలా ఉండగా.. ట్రంప్ కుటుంబం “ఫ్రీడమ్ 250” పేరుతో ప్రత్యేక బంగారు, వెండి నాణేలను కూడా ప్రమోట్ చేస్తోంది. ట్రంప్ చిత్రంతో రూపొందించిన ఈ నాణేలు యూఎఫ్‌సీ, ట్రంప్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా తీసుకొచ్చిన ప్రత్యేక కలెక్షన్‌గా ప్రచారం చేస్తున్నారు. ఈ నాణేల ధరలు సుమారు 250 డాలర్ల నుంచి దాదాపు 12,000 డాలర్ల వరకు ఉన్నాయి. అత్యంత ఖరీదైన బంగారు మెడలియన్ కొనుగోలు చేసిన వారికి ట్రంప్, యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్ చిత్రపటాన్ని కూడా అందజేస్తున్నట్లు సమాచారం.

అమెరికా వార్షికోత్సవ వేడుకల అనంతరం ట్రంప్ ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 (G7) సదస్సుకు హాజరుకానున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలోని ఎవియన్ పట్టణంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రపంచ నాయకులు ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.