Dog’s Unbreakable Loyalty: కుక్కలు విశ్వాసానికి ప్రతిక అని చెబుతుంటాం. ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టల కోసం కన్నవారినే కడతేర్చుతున్న నేటి రోజుల్లో.. కాస్త అన్నం పెట్టిన యజమాని కుటుంబానికి కాపలాగా ఉంటాయి. ఎలాంటి అపాయం రాకుండా కాపాడుతాయి. తాజాగా అలాంటి ఓ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్ ప్రాంతం. అక్కడ మంచు పడితే మనుషులు బయట అడుగు పెట్టడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. అలాంటి చోట ఒక కుక్క చూపిన విశ్వాసం అందరి మనసులను కదిలిస్తోంది. భర్మౌర్‌లోని భర్మాణి దేవాలయం సమీపంలో విక్సిత్ రాణా, పీయూష్ అనే ఇద్దరు యువకులు సడెన్‌గా కనిపించకుండా పోయారు. తీవ్రమైన చలి, భారీ మంచు కారణంగా వారిని కుటుంబీకులు, పోలీసులు సైతం కనుక్కోలేకపోయారు. నాలుగు రోజుల తర్వాత రక్షణ బృందాలు, స్థానికులు ఆ యువకులు తప్పిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ దృశ్యాన్ని చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు.
READ MORE: మరింత రేంజ్, గట్టిగా వినిపించే సౌండ్‌తో కొత్త Apple AirTag లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
పీయూష్ మృతదేహం మంచు పొరల కింద కనిపించింది. ఆ మృతదేహం పక్కనే ఆ యువకుడి పెంపుడు కుక్క పిట్‌బుల్ కూర్చొని ఉంది. నాలుగు రోజుల పాటు ఆ కుక్క అక్కడి నుంచి కదలలేదు. తినడానికి ఆహారం లేదు. చుట్టూ చల్లటి గాలులు, భారీగా కురస్తున్న మంచు. ఎముకలు కొరికే మంచు కురుస్తున్నా.. తన యజమానిని విడిచి ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆ కుక్క తన యజమాని శరీరాన్ని ఆ ప్రాంతంలో తిరిగే అడవి జంతువుల నుంచి కాపాడింది. రక్షణ బృందం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దగ్గరకు వెళ్లగానే, కుక్క ఒక్కసారిగా దూకుడుగా వారి పైకి వచ్చింది. వచ్చిన వాళ్లు తన యజమానికి హాని చేయడానికి వచ్చారని అది భావించింది. చాలా సేపు మృదువుగా దాన్ని బుజ్జగించారు. దీంతో ఆ కుక్క వెనక్కి తగ్గింది. వాళ్లు సహాయం చేయడానికి వచ్చారని అర్థం చేసుకున్నాక తన యజమాని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దారి ఇచ్చింది. ఈ ఘటన విన్నవారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. మాటలు లేని ఒక జంతువు, మరణించిన తన యజమాని డెడ్‌బాడీకి సైతం రక్షణగా నిలిచింది. ఆ కుక్క విశ్వాసం, ప్రేమకు అందరూ మంత్రముగ్దులవుతున్నారు.
READ MORE: Annagaru vostaru: ఓటీటీలోకి కార్తి ‘అన్నగారు వస్తారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
