Site icon NTV Telugu

Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!

Mulugu

Mulugu

Doctor Negligence: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనకి ఇప్పుడు ఓ నిండు ప్రాణం భలి అయ్యింది. డెలివరీ కోసం గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరిన గర్భిణీ విల్లా రవళికి సరైన వైద్య సేవలు అందకపోవడంతో, పుట్టబోయే బిడ్డ మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. విల్లా రవళిని నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆపరేషన్ చేయాలని.. లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళతామని కుటుంబ సభ్యులు డాక్టర్లను అభ్యర్థించారు. కానీ, వైద్యులు వినిపించుకోకుండా బలవంతంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించారంటూ ఆరోపిస్తున్నారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగా పురిటిలోనే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని బాధితులు మండిపడుతున్నారు. అంతేకాకుండా, తమ చేతిలో మృత శిశువును పెట్టి “ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ వైద్యులు బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలమని వారు తెగేసి చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version