Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న(గురువారం) పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయమని.. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయమని ఫైర్ అయ్యారు.
Read Also: Uniform civil code: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు.!
గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. తాను నిఖార్సైన హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని.. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేపు తానే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.