మధ్య భారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాల్లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లాలో చాలా విశాలమైనది. ప్రస్తుతం.. శంకర్ లాల్వానీ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇండోర్ స్థానం నుంచి బీజేపీ ఘన విజయం సాధించారు. ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఏకంగా 10,080,77 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయనకు మొత్తం 12,267,51 ఓట్లు వచ్చాయి.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
అయితే ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ.. రికార్డు స్థాయి విజయం సాధించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి.. నామినేషన్ విత్ డ్రా చేసుకునే చివరి రోజు నామ పత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం ఎవరూ లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీకి కాకుండా నోటాకు ఓటు వేయాలని.. ఎన్నికల ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే నోటాకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. కాగా.. ఇండోర్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నోటా ఉండటం గమనార్హం. ఇండోర్‌లో నోటాకు 2,186,74 ఓట్లు పడ్డాయి. నోటా చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు పడటం ఇదే తొలిసారి. దీంతో అత్యధిక ఓట్ల మెజార్టీతోపాటు నోటాకు అత్యధిక ఓట్లు పడిన ఒకే ఒక నియోజకవర్గంగా ఇండోర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇండోర్ నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీలో నిలవగా.. ఎవరూ శంకర్ లాల్వానీ దరిదాపుల్లో కూడా రాలేదు.