Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!

  • జిబూటీ తీరంలో 305 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా
  • ప్రమాదంలో కనీసం 109 మంది మృతి
  • మృతుల్లో 15 మంది చిన్నారులు
  • మృతుల్లో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు..
  • 116 మంది ఆచూకీ గల్లంతు..
Boat Sinks (1)

Boat Sinks (1)

Boat Sinks: తూర్పు ఆఫ్రికాలోని జిబూటీ తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 305 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో కనీసం 109 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) ఆదివారం వెల్లడించింది. మరో 116 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

IOM వెల్లడించిన వివరాల ప్రకారం.. వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ జిబూటీ నుంచి యెమెన్‌కు బయలుదేరింది. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ పడవ సముద్రంలో బోల్తా పడింది. ప్రమాదంలో మరణించిన వారిలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా, కనీసం 116 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతానికి చెందిన వేలాది మంది మెరుగైన జీవన పరిస్థితులు, ఆర్థిక అవకాశాల కోసం ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారని IOM తెలిపింది. జిబూటీ మీదుగా బాబ్-అల్-మందెబ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యెమెన్‌లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ వలసదారుల ప్రయాణాలు మాత్రం ఆగడం లేదని తెలిపింది. జిబూటీలో IOM మిషన్ చీఫ్ అలెగ్జాండర్ కొయిసెక్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. ఆర్థిక అవకాశాల కోసం ఈ వలస మార్గంలో ప్రయాణించే వారు ఎంతటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందన్నారు.

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి స్థానిక అధికారులు, IOM బృందాలు వైద్య సహాయం అందిస్తున్నాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెరుగైన జీవితం కోసం ప్రమాదకర సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న వలసదారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.