Venkat Prabhu About The GOAT Telugu Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘ది గోట్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ది గోట్.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 22 కోట్లకు కొనుగోలు చేయగా.. 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనబడుతోంది.
తెలుగు, హిందీ భాషల్లో ది గోట్ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోవడంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబందించిన సీన్స్ హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు మరియు హిందీ బెల్ట్‌లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
Also Read: T20 World Cup: ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు.. 13 బంతుల్లోనే విజయం! టీ20ల్లో అత్యంత చెత్త టీమ్ ఇదే
ది గోట్‌లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ, హీరోయిన్ త్రిష అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కూడా చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 280 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.