NTV Telugu Site icon

Prabhu Deva : ప్రజ్ఞాశాలి… ప్రభుదేవ!

Prabhudeva

Prabhudeva

Prabhu Deva : ఒకటా రెండా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ ప్రభుదేవ చిత్రసీమలో తనదైన పయనం సాగిస్తూనే ఉన్నారు. నర్తకునిగా, నటునిగా, దర్శకునిగా, గీతరచయితగా, గాయకునిగా ఇలా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ప్రభుదేవ సాగుతున్నారు. పరువైన ఘనవిజయాలు, పరితాపం పంచిన పరాజయాలు ప్రభుదేవా కెరీర్ లో ఉన్నాయి. అయినా ఎప్పుడూ చెరగని నవ్వుతో కనిపించే ప్రభుదేవ మళ్ళీ డాన్స్ మాస్టర్ గా తన పని తాను చేసుకుంటున్నారు. ఈ నాటికీ ఆయన నృత్యభంగిమలకు తకధిమితై అంటూ స్టెప్స్ వేస్తే చాలు అనుకొనేవారెందరో! ప్రభుదేవ మెలికలు తిరిగే నృత్యం చూసి జనం ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అన్నారు. నిజం చెప్పాలంటే, అతనికంటే ఘనుడు మన ప్రభుదేవ. తన అభినయంతో నవ్వించాడు, కవ్వించాడు, కొండొకచో ఏడ్పించాడు. అన్నిటా ఆకట్టుకున్నారు. అదీ ప్రభుదేవ బాణీగా నిలచింది. ఆపై దర్శకునిగానూ అలరించారు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. తన ప్రతిభను ఎన్ని విధాలుగా చాటుకున్నా, ప్రభుదేవ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డాన్సులే. ఇప్పటికీ స్టార్ హీరోస్ ప్రభుదేవ నృత్య దర్శకత్వాన్నే కోరుకుంటున్నారు. డాన్స్ కు మారుపేరుగా నిలచిన మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ ప్రభుదేవా “తార్ మార్…” పాటకు నృత్యభంగిమలు సమకూర్చి ఆకట్టుకున్నారు.

Read Also: Janhvi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…

తెలుగు చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తోనే ప్రభుదేవా దర్శకునిగా మారారు. తరువాత ఆ చిత్ర నిర్మాత యమ్.ఎస్.రాజు, ప్రభాస్ హీరోగా నిర్మించిన ‘పౌర్ణమి’కీ దర్శకత్వం వహించారు ప్రభుదేవ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. ప్రభుదేవా మాత్రం దర్శకునిగానే ముందుకు సాగారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పోకిరి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా ‘పోక్కిరి’ పేరుతో రీమేక్ చేశారు ప్రభుదేవ. ఆ తరువాత వరుసగా నాలుగు రీమేకులతో సాగారు ప్రభుదేవ. వాటిలో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్ ‘ ఒకటి, ఇక సరైన సక్సెస్ కోసం సల్మాన్ ఖాన్ ఎదురుచూస్తున్న సమయంలో ‘పోకిరి’ రీమేక్ గా ఆయనతో ‘వాంటెడ్’ తీశారు ప్రభుదేవ. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగులో రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా, ఆ సినిమా మరింత విజయాన్ని మూటకట్టుకుంది. అప్పటి నుంచీ వరుసగా హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సాగారు ప్రభుదేవ. అయితే, ‘వాంటెడ్, రౌడీ రాథోడ్’ స్థాయి విజయాలయితే మళ్ళీ అతనికి దక్కలేదు. సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ అనే చిత్రాన్ని 2021లో రూపొందించారు ప్రభుదేవ. ఆ సినిమా సమయంలోనే ప్యాండమిక్ నెలకొనడం, లాక్ డౌన్స్ సాగడం జరిగాయి. అందువల్ల ‘పే ఫర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.19 కోట్లు మాత్రమే పోగేసింది. ‘రాధే’ పరాజయం తరువాత ప్రభుదేవ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also: Anirudh: న్యూజెర్సీలో ‘ఎన్టీఆర్ 30’ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుద్

ఇప్పటి దాకా 15 చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవ, నిర్మాతగా తమిళంలో “దేవి, బోగన్, సమ్ టైమ్స్” అనే మూడు చిత్రాలు నిర్మించారు. నటునిగా 2021లో ‘పొన్‌ మనిక్కావెల్’ తమిళచిత్రంతో యాభై సినిమాలు పూర్తి చేసుకున్న ప్రభుదేవ ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. గత నెలలో ప్రభుదేవ నటించిన ‘బఘీరా’ అనే తమిళ చిత్రం విడుదలయింది. ‘ఫ్లాష్ బ్యాక్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. గాయకునిగానూ ‘సుయంవరమ్’, ‘ఉల్లమ్ కొల్లై పోగుదే’ చిత్రాల్లో గళం పలికించారు. ఇక గీత రచయితగానూ “చార్లీ చాప్లిన్-2”, “దేవీ-2” చిత్రాల్లో కలం పరుగులు తీయించారు. ఏది చేసినా ప్రభుదేవ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన నృత్యమే! మళ్ళీ ప్రభుదేవ ఏ చిత్రంలో తనదైన బాణీ పలికిస్తారో చూడాలి.

Show comments