Hyderabad: పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేసి, డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని సైఫాబాద్, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. ముంబైకు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచూ హైదరాబాద్‌కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అలాగే వారి ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని, హైదరాబాద్‌లో పలు బంగారు ఆభరణాల షాప్స్‌కు తిరుగుతూ… వాటిని అమ్మడం, ఆర్డర్స్ తీసుకునేవారు. ఇటీవల ముంబై నుంచి విపుల్ పార్సల్‌ను పంపించారు. వాటిని మార్కెటింగ్ చేయడానికి.. చడవ రోనక్ (24) ఎగ్జిక్యూటివ్ ముంబై నుంచి నగరానికి వచ్చాడు. మార్కెటింగ్ చేసిన తరువాత, డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్‌ను బషీర్‌బాగ్‌లోని విజయ శంకర్ లాల్ జ్యూవెలర్స్‌లో భద్రపరిచారు. మరుసటి రోజు బ్యాగ్ చూడగా అందులో ఆభరణాలు కనిపించలేదు.
READ MORE: Hydra: మీ ఏరియాలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందా..? ఈ నంబర్‌కి కాల్ చేయండి..
దీంతో ఆ షాప్ యజమాని ముంబైలోని విపుల్‌కు సమాచారం ఇచ్చాడు. ముంబై నుంచి వచ్చిన విపుల్ కోటిన్నర విలువ చేసే డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్ కనిపించడం లేదని.. 7వ తేదీన సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆభరణాల బ్యాగ్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ చడవ రోనక్ తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. బ్యాగ్ పోయిందని తెలియగానే, అతని తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ముంబై వెళ్తున్నని యజమానికి చెప్పి వెళ్లడంతో పోలీసులు అతని కదలికలపై నిఘా పెట్టారు. గురువారం చడవ రోనక్ అతని స్నేహితుడు మహమ్మద్ హాసనైన్ (22) తో కలిసి పట్టుపడ్డాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తామే దొంగలించినట్లు వెల్లడించారు.
