Tholi Ekadashi Remedies For Money Problems: తిథుల్లో ‘ఏకాదశి’ అత్యంత శుభప్రదమైనది. ఆషాఢమాసంలో శుక్ల పక్షమిలో వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్ర దినాన్ని హరివాసరం, దేవశయనీ ఏకాదశి, సర్వేషాంశయనైక ఏకాదశిగా కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించి.. యోగనిద్రలోకి వెళ్లే శుభదినమే ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి.. మళ్లీ నాలుగు నెలల తరవాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు.
తొలి ఏకాదశి రోజు పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చని చెబుతారు. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేస్తే.. జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలిగిపోయి.. జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితం సుఖంగా సాగిపోతుంది. తొలి ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.
తొలి ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారాలు:
# తొలి ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగం, కార్యాలయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
# తొలి ఏకాదశి నాడు దానం చేయడం చాలా మంచిది. దాంతో మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున పేదలకు అన్నదానం చేయాలి.
# మీ వైవాహిక జీవితం సరిగా లేకుంటే.. తొలి ఏకాదశి రోజున తులసి మాతను పూజించండి. ఈ రోజున తులసి మాతతో పాటు లక్ష్మీదేవికి పూలు, ప్లండ్లు, నైవేద్యంను సమర్పించండి.
# తొలి ఏకాదశి నాడు భగవద్గీతను పఠించడం అత్యంత పుణ్యమైనదిగా పరిగణిస్తారు.
# తొలి ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజలు చేయడం శుభప్రధం. రావి చెట్టుకు నెయ్యి దీపం వెలిగించి.. ప్రదక్షిణలు చేయండి. దాంతో విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి.. డబ్బు రాక పెరుగుతుంది.
# మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. తొలి ఏకాదశి రోజున పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించండి. తమలపాకుపై ‘ఓం విష్ణువే నమః’ అని రాసి విష్ణువు పాదాల చెంత సమర్పించండి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి దాచి ఉంచండి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)