హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ-3 పంప్‌హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆరంభం అయ్యాయి. రాత్రి వరకు పలు కారణాలతో మొరాయించిన మూడో దశలోని దేవన్నపేట పంపు హౌస్ మోటర్లు ప్రారంభమయ్యాయి. దీంతో గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. మోటార్లు ఆన్ కావడంతో.. అధికారులు, మెగా కంపెనీ, ఆస్ట్రియా దేశ ఇంజినీర్లు ఆనందం వ్యక్తం చేశారు.
దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌస్ ప్రారంభం కాకపోవడంతో.. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ పంప్ హౌస్‌లోని ఒక్క మోటర్‌ను అయినా ప్రారంభించి రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే సాంకేతిక కారణాలతో మోటార్లు ప్రారంభం కాలేదు. దీంతో దేవాదుల పంపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం జరిగింది. గత 15 రోజులుగా ఆస్ట్రియా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు మోటార్ల సమస్యలు పరిష్కరించారు. దేవాదుల మూడోదశ మోటార్లను మరమ్మతు చేసి.. ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో సాగునీరు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించింది.
దేవాదుల మూడో దశ పంప్‌హౌస్ మోటార్లను అధికారులు మూడు రోజులుగా డ్రైరన్ విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ట్రయల్ రన్ చేయడానికి సర్జ్‌పూల్‌లోని మోటార్లను ఆన్ చేయగా.. అవి నీళ్లు పోస్తున్నట్లు స్కాడాలో చూపించలేదు. వెంటనే అధికారులు మోటార్లను ఆపేశారు. రాత్రి మోటార్లకు సంబంధించిన టెక్నికల్ ఇంజినీర్లను సర్జ్‌పూల్ బావిలోకి పంపించి చూడగా ఆయిల్ లీకైనట్లు కనిపించింది. బుధవారం ఉదయం లీకైన ఆయిల్‌ను సరిచేసి.. డ్రైరన్ నిర్వహించగా విజయవంతమైంది. సాయంత్రం మోటార్లను ఆన్ చేయగా.. ట్రిప్ అయ్యి ఆగిపోయాయి. అధికారులు, ఇంజినీర్లు మరమ్మతు ప్రక్రియ చేశారు. చివరకు గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మోటార్లను ఆన్ చేశారు. అప్పటినుంచి విజయవంతంగా నడుస్తున్నాయి.