NTV Telugu Site icon

Indrakiladri: ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. దుబాయి మాదిరి ఫసాడా లైటింగ్..

Indrakiladri

Indrakiladri

దసరా ఉత్సవాలపై దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి రివ్యూ నిర్వహించారు. దసరా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అనే అంశాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే భక్తులు విజయవాడకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9న మూల నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దుబాయి మాదిరి ఫసాడా లైటింగ్ ఈసారి ప్రత్యేకంగా నిలవనుందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ మీద కూడా లైటింగ్ ఏర్పాటు చేసి ఇంద్రకీలాద్రి క్షేత్ర మహిమ తెలిపేలా లేజర్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్యూలైన్లు అన్నీ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని.. ప్రతీ వందడుగులకు అత్యవసర ద్వారాలు క్యూలైన్లలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

READ MORE: Pawan Kalyan: కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మొదటిసారి భక్తుల కోసం వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వెయ్యిమంది ఒకేసారి తమ చెప్పులు, సామాన్లు పెట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జల్లు స్నానాలకు ఘాట్ల వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హోల్డింగ్ ఏరియాల వద్ద 200 మంది చొప్పున ఉండేలా చూస్తున్నారు. శివాలయం వద్ద నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్ళే మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. కళావేదిక, ప్రసాదాల కౌంటర్ లు ప్రత్యేకంగా అలంకరణ పెట్టనున్నారు. వీవీఐపీ ఘాట్లు వద్ద జల్లు స్నానాలకు పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత , మంత్రి కొల్లు రవీంద్ర, పశ్చిమ ఎంఎల్ఏ సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఈఓ తదితరులు పాల్గొన్నారు.