లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర తండ్రి ఏనుముల సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అషు రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన అంశాలు ఇవే..
తొలి పరిచయం : కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో ఓ పార్టీలో ధర్మేంద్రకు అషు రెడ్డి పరిచయమయింది. తాను నటినని అమెరికాలో మాస్టర్స్ చేశానని పరిచయం చేసుకుంది అషు రెడ్డి. అయితే ధర్మేంద్రకు అప్పటికే వివాహం అయ్యి విడాకుల ప్రక్రియలో ఉన్నారని తెలిసినప్పటికీ ఆమె అతడిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.
ఆర్థిక సహాయం : తన అమెరికా చదువు కోసం తీసుకున్న లోన్లు ఉన్నాయని, తన తండ్రి ఆర్థికంగా సహకరించడం లేదని చెప్పి ధర్మేంద్ర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. ఆ డబ్బులతో ఆస్తుల కొనుగోలు చేసి విలాసవంతమైన జీవనం సాగిస్తూ తన తండ్రి పెళ్లికి అంగీకరించాలంటే తాను విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు చూపాలని నమ్మించి తన పేరు మీద ఖరీదైన కార్లు, బంగారం, స్థిరాస్తులు కొనిపించారు. రూ. 9.35 కోట్ల వసూలు:* 2020 నుండి 2025 మధ్య కాలంలో సుమారు 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు మరియు ఇతర ఆస్తుల రూపంలో మొత్తం 9.35 కోట్ల రూపాయలను ధర్మేంద్ర నుండి అషు రెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మణికొండలో ఫ్లాట్ : ల్యాంకో హిల్స్ సమీపంలోని అర్కా మణికొండలో రూ. 3 కోట్ల విలువైన ఫ్లాట్ కోసం రూ. 1.80 కోట్లు ధర్మేంద్రతో చెల్లించి ఆ ఫ్లాట్‌ను తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది అషు.
కుటుంబ సభ్యుల ప్రమేయం : అషు రెడ్డి సోదరి వివ్య రెడ్డి, తల్లి యశోద రెడ్డి మరియు తండ్రి వెంకట కృష్ణ కొయ్య కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని బాధితుడు పేర్కొన్నారు. వీరంతా ధర్మేంద్రను ‘అల్లుడు’ అని పిలుస్తూ అతడిని నమ్మించి డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. జాతకాలు కలవాలని చెప్పి అక్టోబర్ 2024లో వేణు స్వామి అనే జ్యోతిష్యుడిని కూడా కలిసినట్లు పత్రంలో ఉంది.
పెళ్ళికి నిరాకరణ : జూలై 2025లో పెళ్లి చేసుకోవాలని ధర్మేంద్ర ఒత్తిడి తెస్తుండడంతో అషు రెడ్డి పెళ్లికి నిరాకరించారు. దాంతో తన డబ్బు, బంగారం తిరిగి అడగగా.. పెళ్లి చేసుకోనని, డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు ఫిర్యాదులో వివరించారు. అషు రెడ్డికి నమ్మి శివ జయంత్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, వీరంతా కలిసి పథకం ప్రకారం ‘హనీ ట్రాప్’ చేసి తన కుమారుడిని మోసం చేశారని సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు.
పోలీసు నమోదు: హైదరాబాద్ CCS పోలీసులు దీనిపై క్రైమ్ నెం. 78/2026 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ACP (EOW Team-1) కి అప్పగించారు.
