Site icon NTV Telugu

Earthquake: పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి

Earthquake

Earthquake

Earthquake: పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.ఈక్వెడార్‌లోని మచలా, క్యూన్కా వంటి నగరాల్లో భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరాల్లో శిథిలాల దిబ్బలు కనిపించాయి. భూమి కంపించగానే భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. రెస్క్యూ అధికారులు సహాయం అందించడానికి అక్కడికి చేరుకున్నారు.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండేది.
దీని కేంద్రం పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్ మునిసిపాలిటీ బాలావోలో ఉందని అధికారులు తెలిపారు.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపైకి 10 వేల మంది పోలీసుల.. గన్స్, పెట్రోల్ బాంబులు స్వాధీనం

గ్వాయాక్విల్, క్విటో, మనాబీ, మాంటాతో సహా ఇతర నగరాల్లో కూడా ప్రకంపనలు బలంగా కనిపించాయని సోషల్ మీడియా నివేదికలు తెలిపాయి. పెరూలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం, పెద్ద నష్టం నివేదించబడలేదు. ఇక్కడ భూకంపం తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. భవనాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని.. ప్రశాంతంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు. . క్యూయెంకాలో ఓ భవనం… కారుపై కుప్పకూలడంతో… కారులోని వ్యక్తి చనిపోయినట్లు తెలిసింది. శాంటా రోసాలో మరో ముగ్గురు చనిపోయారని తెలిసింది. ఎల్ ఓరో ప్రావిన్స్‌లో, ఒక టవర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలిసింది. ప్రభుత్వ రిపోర్టుల ప్రకారం… శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

పెరువియన్ సిస్మోలాజికల్ అధికారులు మొదట్లో 7.0 తీవ్రతను నివేదించారు, కానీ గంటల తర్వాత తీవ్రతను 6.7కి తగ్గించారు. ఈక్వెడార్‌లోని బాలావోలో 4.8 తీవ్రతతో మొదటి భూకంపం నమోదైంది. సునామీ ముప్పు లేదని ఈక్వెడార్ నౌకాదళం తెలిపింది.

Exit mobile version