Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్‌.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..

Deputy Cm Pawan Kalyan Slam

Deputy Cm Pawan Kalyan Slam

Deputy CM Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌లో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోంది.. సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని చెబుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదని, కావాలనే, తెలిసే చేసిన చర్యలేనని అన్నారు.

2019–2024 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం నలుమూలల 200కుపైగా మత సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ ఉన్నట్టు నివేదికలు రావడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. రాజకీయ లాభనష్టాలు ఆలోచించకుండా, తెలిసిన నిజాన్ని చెప్పకపోతే అది తప్పవుతుందని స్పష్టం చేశారు. గత పాలకులు భగవంతుడిపై పగ పట్టినట్లుగా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలు తయారు చేసిన ఘటనలు ఉన్నాయి.. దుర్గమ్మ ఆలయంలో వెండి విగ్రహాల చోరీ జరిగితే ‘ఇంకోటి కొనుక్కోవచ్చు’ అన్న ధోరణి.. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం.. ఇలాంటి అనేక సంఘటనలు వైసీపీ పాలనలో జరిగాయని గుర్తు చేశారు.

NDDB నివేదికే ఆధారం
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యి లేదని NDDB నివేదిక స్పష్టంగా తేల్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు నిజాలు వెల్లడించారని చెప్పారు. 319 రూపాయలకు నెయ్యి సరఫరా జరిగిందంటే ఎంత స్థాయిలో కల్తీ జరిగిందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇక, ఈ వ్యవహారంపై వచ్చిన సీబీఐ నివేదిక ఎక్కడా క్లీన్ చీట్ ఇవ్వలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. NDDB నివేదికలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, రసాయనాలు ఉండే అవకాశాలున్నాయని పేర్కొనడం మరింత తీవ్ర విషయమని అన్నారు. అయితే, తప్పు జరిగిందని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం చూపకుండా, తిరిగి ‘ఎలాంటి తప్పులు జరగలేద’ని ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వైసీపీ ఈ వ్యవహారంపై తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హిందూ మత గౌరవం కాపాడుతున్నాం
తాము హిందూ మత గౌరవాన్ని కాపాడుతున్నామని, కానీ ఇతర మతాలను ఎక్కడా అగౌరవపరచడం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదని, భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని, మళ్లీ నివేదికలు వచ్చేందుకు సమయం పడుతుందని, అప్పటివరకు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘ఏడు కొండల వారితో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Exit mobile version