రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సంద్భంగా.. చందనవెల్లి భూ బాధితులు ఆయనను కలిశారు. అనంతరం వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ భాధితులు తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారని భట్టి విక్రమార్క తెలిపారు. భూ భాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు రావలసిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి.. వాస్తవాలు బయటికి తీసుకు వస్తామని అన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
TS News: ఖైదీలకు గుడ్‌న్యూస్.. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారంటే..!
ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో మాట్లాడకుంటే పాలన జరగదు.. ప్రజలు లేని పాలన అది పాలనే కాదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలు విని వాటిని పరిష్కారం చేస్తేనే అది ప్రజా ప్రభుత్వం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు వారి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా ప్రజలను కలుస్తారని చెప్పారు. మంత్రుల పర్యటన సందర్భంగా గత ప్రభుత్వాల మాదిరిగా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనలో ప్రజలకు నిర్బంధాలు ఉండవని తెలిపారు. రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా అనుభవించడమే తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని పేర్కొన్నారు.
భూ పోరాటమే తన జీవితమని భావించిన గద్దర్ అన్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తనతో పాటు చందనవెల్లికి రావడం జరిగిందని అన్నారు. చందనవెల్లి భూ బాధితుల సమస్య తన దృష్టికి వచ్చినప్పుడు గద్దర్ అన్న తప్పనిసరిగా గుర్తుకు వస్తారని చెప్పారు. జీవితమే భూ పోరాటం అని భావించిన గద్దర్ అన్నకు నిజమైన నివాళి అర్పించడం అంటే.. భూ బాధితులకు న్యాయం చేయడమేనని భట్టి విక్రమార్క తెలిపారు.