Site icon NTV Telugu

ఢిల్లీలో విజృంభిస్తోన్న డెంగీ.. వారం రోజుల్లోనే 280 కేసులు

మొన్నటి వరకు కరోనా…ఇప్పుడేమో వైరల్‌ ఫీవర్లు…ఢిల్లీని టెన్షన్‌ పెడుతున్నాయ్. వారం రోజుల్లోనే 3వందల మంది డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఢిల్లీ సర్కార్‌…కరోనా వార్డులను డెంగీ రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే…మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో…ఆస్పత్రులన్నీ వైరల్‌ ఫీవర్‌ బాధితులతో నిండిపోతున్నారు. దీంతో కేజ్రీవాల్ సర్కార్‌ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు… డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది.

డెంగీ, మలేరియా, చికన్‌ గున్యా బాధితుల కోసం వినియోగించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని ఆసుపత్రుల్లో డెంగీ రోగుల కోసం తగినన్ని ఏర్పాట్లు చేసింది. ఏ రోగిని కూడా వెనక్కి పంపే అవసరం ఉండబోదని సర్కార్‌ స్పష్టం చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఆసుపత్రుల్లో పడకల సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో అలాంటి సమస్యలేమీ లేవని ఆరోగ్య శాఖ తెలిపింది. 20 రోజుల్లో దాదాపు 7వందల డెంగీ కేసులు నమోదు కావడంతో…ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో 280 కేసులు గత వారమే నమోదయ్యాయి. డెంగీ నిర్మూలనకు ఆప్‌ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయిస్తున్నారు.

Exit mobile version