ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆప్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. తాజాగా బుధవారం కూడా మరో పిటిషన్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. కావాలనే ఉద్దేశపూర్వంగా ఇలాంటి పిటిషన్లు వేస్తు్న్నారని ధ్వజమెత్తింది. ఈ సందర్భంగా ఇలాంటి పిటిషన్లు వేస్తున్నందుకు పిటిషనర్‌కు రూ.50 వేలు ఫైన్ విధిస్తామని తెలిపింది. వ్యవస్థలను అపహ్యాసం చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా పిటిషనర్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పిటిషన్లు అరికట్టాలంటే జరిమానాలు విధించడమే కరెక్ట్ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. పిటిషన్ కొట్టేసింది.
మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
