Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..

Yuvraj Singh Team

Yuvraj Singh Team

ఢిల్లీ హైకోర్టు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బిగ్ రిలీఫ్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిత్వానికి సంబంధించిన గుర్తింపులను వ్యాపార పరంగా లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించకుండా మూడో వ్యక్తులపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆయన పేరుతో వస్తువులను విక్రయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించే ‘డీప్‌ఫేక్’ కంటెంట్‌ను తయారు చేసి వ్యాప్తి చేయడంపై కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలతో నిషేధించింది. యువరాజ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోతి సింగ్ విచారణ జరిపారు.

యువరాజ్ సింగ్ మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో ఒకరని, ఆయన 17 ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని కోర్టు పేర్కొంది. ఆయన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ‘యువరాజ్ సింగ్’ లేదా ‘యువి’ అనే పేర్లు, ఆయన చిత్రం, వాయిస్, రూపాన్ని అనధికారికంగా వాడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఏఐ సాయంతో ఆయనపై అనుచితమైన ఫోటోలు, వీడియోలు సృష్టిస్తూ, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, ఇతర క్రికెటర్లతో గొడవపడుతున్నట్లు చూపించే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని యువరాజ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ తరహా ప్రచారం వల్ల యువరాజ్ ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని భావించిన కోర్టు, మెటా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను సదరు వివాదాస్పద కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తన గుర్తింపు ద్వారా పొందే వ్యాపార ప్రయోజనాలపై యువరాజ్‌కు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని వెల్లడించింది. గతంలో కూడా ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, క్రిటికల్ ప్లేయర్ అభిషేక్ శర్మ వంటి పలువురు ప్రముఖులు తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి ఉపశమనాన్నే పొందారు.