Site icon NTV Telugu

Delhi Liquor Policy: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పాత ఎక్సైజ్‌ పాలసీ 6 నెలలు పొడిగింపు

Delhi Excise Policy

Delhi Excise Policy

Delhi Liquor Policy: ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. వీలైనంత త్వరగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అప్పటివరకు పాత పాలసీని కొనసాగించనుంది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఈ ఆరు నెలల్లో ఐదు డ్రైడేలు ఉంటాయని.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్ ఉల్-ఫితర్, ఈద్ ఉల్-జుహా పండుగలు ఉన్న రోజుల్ని డ్రై డేలుగా ప్రకటించింది. ఈ 5 రోజుల్లో లిక్కర్ అమ్మకాన్ని నిషేధించింది.

Read Also: Himanta Biswa Sarma: వచ్చే 3 ఏళ్లలో పంజాబ్ జీడీపీని అస్సాం అధిగమిస్తుంది..

ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని గత ఏడాది ఆగస్టు 31న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీ అమలు విషయంలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపణలు చేయడం.. సీబీఐ విచారణ చేయడంతో కొత్త పాలసీని రద్దు చేశారు. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియాను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం, దేశ రాజధానిలో 570 రిటైల్ మద్యం దుకాణాలు, 950 కంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు మద్యం అందించడానికి లైసెన్సులు కలిగి ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటిదాకా 10 మందికిపైగా అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఒకసారి విచారించింది. ఇవాళ మరోసారి విచారించనుంది.

Exit mobile version