Arvind Kejriwal: భారత్ – చైనాల సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేషనల్ కౌన్సిల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఓవైపు చైనా మనపై దాడికి దిగుతుంటే.. వారి ఉత్పత్తులను గణనీయంగా దిగుమతి ఎందుకు చేసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన.. చైనా ఉత్పత్తులను నిషేధించాలని దేశ పౌరులకు పిలుపునిచ్చారు. బార్డర్‌లో చైనా చొరబాట్లు పెరుగుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతా సవ్యంగానే ఉందని చెబుతుందని విమర్శించారు. చైనా విషయంలో శిక్షించడానికి బదులు వారికి సహకరించేలా కేంద్రం ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
కొన్నేళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఐదు సీట్లు గెలవడం ఆమ్ ఆద్మీ పార్టీ అపూర్వ విజయంగా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు, కొన్నేళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఐదు సీట్లు గెలవడం “ఎద్దుకు పాలు పితికినంత” కష్టమని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో చేసినట్లుగా, 2027లో గుజరాత్‌లో బీజేపీని అధికారం నుంచి తొలగించి, అక్కడ కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నొక్కి చెప్పారు. గుజరాత్‌లో జరిగిన తాజా ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 13 శాతం ఓట్లతో ఐదు స్థానాలను గెలుచుకుంది. ఢిల్లీలో ఏర్పాటైన ఏడాదిలోపే అధికారంలోకి వచ్చి, 10 ఏళ్లలోపు మరో రాష్ట్రం పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిన ఏకైక పార్టీ బహుశా ఆప్ మాత్రమేనని ఆయన అన్నారు.ఇంత తక్కువ వ్యవధిలో ఆప్ అద్భుతంగా ఎదగడానికి మా భావజాలం, కృషి కారణమని ఆయన అన్నారు.
Fuel Tank Blast: సొరంగమార్గంలో పేలిన ఇంధన ట్యాంకర్.. 19 మంది దుర్మరణం
ఆదివారం ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి జాతీయ భద్రత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై చర్చించినట్లు ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఈ మూడు అంశాలపై పార్టీ తన సిఫార్సులను కేంద్రానికి సమర్పిస్తుందన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. మన దేశంలోకి చైనా ఎంతగా చొరబడితే అంతగా కేంద్రం చైనా నుంచి దిగుమతులను పెంచుతుందని, దీనిపై ఏదైనా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు విసుగు చెందిన ఒక విషయం ఉంటే అది ద్రవ్యోల్బణం గోపాల్ రాయ్ అన్నారు.
