Aap Minister Resign: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పదవి నుంచి తొలగించాలని నిరసనలు చేపట్టటంతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివాదాస్పదం కాకుండా ఉండేందుకు మంత్రి చేత రాజీనామా చేయించినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి. మరోవైపు మాన్యవర్ కాన్షీరామ్ సాహెబ్ వర్ధంతి కూడా. అలాంటి రోజున యాదృచ్ఛికంగా నేను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందాను. ఈ రోజు నేను మళ్లీ జన్మించాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజం హక్కులు, దౌర్జన్యాలపై పోరాడతా’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన రాజీనామా లేఖను ట్విటర్‌లో కూడా ఉంచారు.
Uddav Thackeray: హతవిథీ.. ఉద్ధవ్ గుర్తు ఏంటి? త్రిశూలమా? ఉదయించే సూర్యుడా?
దసరా రోజున హిందువులు బౌద్ధమతంలో చేరే మత మార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొనడం తీవ్ర దుమారమే రేపింది. సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో తాను కూడా వారితో కలిసి ప్రతిజ్ఞ చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధానంగా బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నిరసన సెగలు తగిలాయి. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగానే మంత్రి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.