ఇన్నింగ్స్ ప్రారంభం చూశాక తాము 220 పరుగుల వరకు చేస్తామనుకున్నామని, 272 స్కోర్ చేస్తామని మాత్రం అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు (277) మిస్ అయినందుకు తమకు ఏమాత్రం బాధ లేదన్నాడు. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడాడని, యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితిపై తమకు ఇంకా తెలియదని శ్రేయస్ చెప్పాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోర్ రికార్డును అధిగమిస్తామనే ఆలోచన లేదు. మా ఇన్నింగ్స్ ప్రారంభం చూశాక 220 పరుగులు చేస్తామనుకున్నాం. అయితే 270 స్కోర్ చేస్తామనుకోలేదు. ఆ స్కోర్ సాధించడం చాలా బాగుంది. అయితే భారీ స్కోరు రికార్డు మిస్ అయినందుకు ఏమాత్రం బాధ లేదు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం ఎప్పుడూ రిస్కే. సునీల్ నరైన్ ప్రత్యర్థి బౌలింగ్‌పై రెచ్చిపోతే.. మా పని ఇంకా తేలికవుతుంది. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం అతడి శైలి’ అని చెప్పాడు.
Also Read: Rishabh Pant: ఏది కలిసి రాలేదు.. మా ఓటమికి కారణం అదే: పంత్
‘భారీ లక్ష్యం నిర్దేశించినా.. ఓటమి భయం (బౌలింగ్ సరిగ్గా లేకపోతే) ఎవరికైనా ఉంటుంది. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బాధ్యతగా ప్రత్యర్థిని కట్టడి చేసి మంచి విజయాన్ని అందించారు. యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం గురించి వివరాలు ఇంకా తెలియదు. భుజాన్ని పట్టుకుని మైదానాన్ని వీడాడు. అతని గాయం గురించి తెలుసుకుంటాం. వైభవ్ అరోరా కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా మూడు విజయాలు రావడం ఆనందంగా ఉంది. ఈ విజయాలకు ఉప్పొంగిపోము. ఎందుకంటే ఐపీఎల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.