Former Team India Captain Dattajirao Gaekwad Passes Away: భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రే దత్తాజీరావు గైక్వాడ్.
దత్తాజీరావు గైక్వాడ్ పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు. అందరూ ఆయనను దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. 1952-1961 మధ్య భారత్ తరపున 11 టెస్టులు ఆడిన గైక్వాడ్.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్ పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. 1952లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన దత్తాజీరావు.. 1961లో చెన్నైలో పాకిస్థాన్‌పై చివరి మ్యాచ్ ఆడారు.
Also Read: Kota Student Death: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో మరణం!
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు దత్తాజీరావు గైక్వాడ్ ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. దత్తాజీరావు మృతిపై బీసీసీఐ సంతాపం ప్రకటించింది. ‘భారత మాజీ కెప్టెన్, టీమిండియా అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. భారత్ తరఫున 11 టెస్టులు ఆడారు. 1959లో ఇంగ్లండ్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించారు. అతని కెప్టెన్సీలో బరోడా 1957-58 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. గైక్వాడ్ కుటుంబంకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది.