NTV Telugu Site icon

IPL 2025: ఏప్రిల్ 17న 300 పరుగులు పక్కా.. డేల్ స్టెయిన్ జోస్యం!

Ipl 2025

Ipl 2025

2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌) తన మొదటి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (106 నాటౌట్‌; 47 బంతుల్లో 11×4, 4×6) మెరుపు సెంచరీ చేయగా.. ట్రావిస్‌ హెడ్‌ (67; 31 బంతుల్లో 9×4, 3×6), హెన్రిచ్ క్లాసెన్‌ (34; 14 బంతుల్లో 5×4, 1×6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30; 15 బంతుల్లో 4×4, 1×6)లు మెరుపులు మెరిపించారు. గతేడాది భారీ స్కోర్లతో మూడుసార్లు అలరించిన ఎస్ఆర్‌హెచ్‌.. ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లోనే 300 పరుగులకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న ఎస్ఆర్‌హెచ్‌ 300 పరుగులు చేస్తుందని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ జోస్యం చెప్పాడు.

Also Read: My Doctor-David Warner: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!

ఆదివారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంచనాలకు ఏమాత్రం తగ్గేదే లేదని ఎస్ఆర్‌హెచ్‌ చాటింది. ఎస్ఆర్‌హెచ్‌ ఆటగాళ్ల మెరుపులకు హైదరాబాద్‌ అభిమానులతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ అనంతరం డేల్‌ స్టెయిన్‌ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘చిన్న అంచనా. ఏప్రిల్ 17న ఐపీఎల్‌లో మొదటిసారి 300 పరుగులు మనం చూస్తాము. ఎవరికి తెలుసు, అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండవచ్చు’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఏప్రిల్ 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియన్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. గతేడాది వాంఖడేలో హైదరాబాద్‌ 277 పరుగులు చేయగా.. ముంబై 246 రన్స్ చేసింది.