పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుఫాన్ ప్రస్తుతం గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ తుఫాను తీవ్రతను బట్టి ప్రస్తుతం నెల్లూరుకు దాదాపు 100 కిలోమీటర్లు, కావలికి 120 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, ఒంగోలుకు 160 కిలోమీటర్లు, బాపట్లకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత ముందుకు కదులుతూ ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ అధికారులు భావిస్తున్నారు.
ఈ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు అత్యంత బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను దాటే సమయంలో, వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను నిరంతరం గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, RTGS సీఈఓ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

