‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తుంఢంతో పంటపై రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన సమయంలో వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటలు నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు నష్టం వాటినట్టు వాపోతున్నారు. ఎకరానికి 40 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు 10 నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Telugu Titans: విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్.. రెండడుగుల దూరంలో ప్రొ కబడ్డీ కప్!
ఎన్టీఆర్ జిల్లాలో మంథా తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదీ పరీవాహక ప్రాంతాలలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అన్నారు. పునరావాస కేంద్రాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని, బుడమేరు ప్రస్తుతం కంట్రోల్లో ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ చెప్పారు.
