Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌.. ఏపీకి తెలంగాణ సాయం!

Ap And Telangana Govt

Ap And Telangana Govt

Telangana Sends Help to AP: అర్నబ్‌ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు అవసరమైన అదనపు సిబ్బంది, సామగ్రిని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది. ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు ఫోన్‌ చేశారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పరిస్థితి, పునరుద్ధరణ పనుల పురోగతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో కలిసి నవీన్‌ మిట్టల్‌తో చర్చించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బంది, అవసరమైన సామగ్రిని పంపించాలని కోరారు. విద్యుత్‌ సరఫరాను సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చేసిన అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తుఫాన్ విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు తెలంగాణ విద్యుత్‌ శాఖ ముందుకొచ్చింది. విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కోసం అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ఏపీకి పంపేందుకు అంగీకరించింది. తుఫాన్ కారణంగా విద్యుత్‌ స్తంభాలు, ఇతర విద్యుత్‌ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు ఈ సహకారం ఉపయోగపడనుంది. రెండు రాష్ట్రాల విద్యుత్‌ శాఖల సమన్వయంతో పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి, ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించనున్నారు.