Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!

Konaseema Cyclone Arnab

Konaseema Cyclone Arnab

CM Chandrababu to Visit Konaseema Today: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. అలాగే పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులతో సమావేశమై ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇవ్వనున్నారు.

సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12.10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటల నుంచి 1.30 గంటల వరకు వెట్లపాలెంలో రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. పంట నష్టం, పెట్టుబడులు, పరిహారం వంటి అంశాలపై రైతులతో మాట్లాడనున్నారు. తుఫాన్‌ కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.35 గంటల వరకు కాట్రేనికోన మండలం గచ్చకాయలపోరలోని తుఫాన్‌ పునరావాస కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. తుఫాన్‌ వల్ల ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు వంటి అవసరమైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను కూడా పరిశీలించనున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జరిగిన నష్టాన్ని, సహాయక చర్యల పురోగతిని సీఎం క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేయనున్నారు.

మధ్యాహ్నం 2.35 గంటల నుంచి 2.55 గంటల వరకు సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. తుఫాన్‌ నష్టం, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, బాధితులకు అందించనున్న సహకారం వంటి అంశాలపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.40 గంటలకు చెయ్యేరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న చంద్రబాబు.. సాయంత్రం 4.25 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించడం, రైతులు-బాధితుల సమస్యలను తెలుసుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.