అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రచండ ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వంతెనలు, కాజ్‌వేలు దెబ్బతినడంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు తుఫాన్ సంబంధిత వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గల్లంతయ్యారు. భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అర్నబ్ తుఫాన్ ధాటికి గోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. భారీగా వీచిన ఈదురుగాలులకు పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులపై పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు మొదళ్ల వద్ద విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లింది. తుఫాన్ కారణంగా పది వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సమాచారం. విద్యుత్ తీగలు తెగిపడి రహదారులపై పడటంతో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడింది. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అనకాపల్లి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగుతున్నాయి. పలు వంతెనలు, కాజ్‌వేలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్దేరు జలాశయం నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది పరిసర ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పాడేరు, అరకుతో పాటు నర్సీపట్నం వైపు వెళ్లే మార్గంలో వడ్డాది వద్ద ఉన్న ప్రధాన వంతెన, కాజ్‌వే తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 100 గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం భారీ వర్షాలకు జలమయమైంది. తుఫాన్ తీరం దాటి రెండు రోజులు గడిచినా.. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సాధారణ జనజీవనం ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గోపాలపట్నంలో అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వ్యవసాయ రంగంపైనా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, గాలుల ధాటికి వరి పంట నేలకొరిగింది. కొబ్బరి తోటలు కూడా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయిన గ్రామాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

