బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం క్రమంగా బలపడుతూ ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది.
తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..
తుఫాన్‌గా మారిన అనంతరం ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ‘తీవ్ర తుఫాన్’గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రం పైనే దీని తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది.
తీరం దాటే అంచనాలపై ఉత్కంఠ
ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం.. ఈ నెల 19వ తేదీ రాత్రికి ఈ తుఫాన్ తీరానికి చేరే అవకాశం ఉంది. అయితే, తీరం దాటే సమయానికి తుఫాన్ గమనం, దాని తీవ్రతకు సంబంధించిన అంచనాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే ప్రమాదం ఉండగా, దిశ మార్చుకుంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలూ లేకపోలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారనుంది. ముఖ్యంగా ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 17 నుంచే తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

