సైబరాబాద్ పోలీసులు పలు సినిమా థియేటర్లకు షాక్ ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు సినిమా థియేటర్ యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. థియేటర్ యజమానులు తప్పనిసరిగా థియేటర్ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని కొన్ని థియేటర్లను గుర్తించామని, లైసెన్సులు రెన్యువల్ చేసుకోని థియేటర్లు యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సైబరాబాద్ సీపీ వెల్లడించారు. థియేటర్ యాజమాన్యాలు లైసెన్సులను రెన్యువల్ చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. సినిమా థియేటర్‌లో భద్రత ప్రమాణాలు లేనందు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రద్దీగా ఉండే రోడ్లపై టైమ్-షెడ్యూల్ పాటించాలని, థియేటర్ ముందు తరచూ ట్రాఫిక్ జామ్‌లు కలగకుండా జాగ్రతలు చేపట్టాల్సిన బాధ్యత సినిమా థియేటర్ల యజమానులదేనన్నారు.
వాహనాల ప్రత్యేక పార్కింగ్ ఉండాలని, సైబరాబాద్ పరిధిలోని సినిమా థియేటర్ల యజమానులతో సమావేశం నిర్వహించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర.. సినిమా హాళ్ల సరైన నిర్వహణ కోసం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లాల్లోని సినిమా థియేటర్ యజమానులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జీహెచ్‌ఎంసీ, లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.