దీపావళి ఆఫర్లు అనగానే.. వావ్ అని నోరెళ్లబెడుతున్నారా !! దివాళి గిఫ్ట్స్, బోనస్, రివార్డ్ పాయింట్స్ అనగానే… వెనకాముందు ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త !! ఇప్పటికే దివాళి దొంగలు ఎంట్రీ ఇచ్చేశారు. దీపావళిని కూడా కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఇప్పటికే రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం చేశారు. సందర్భమేదైనా సరే… సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టినా.. కంపెనీలు ఆఫర్లు ప్రకటించినా.. పండగలు వచ్చినా… చివరకు వరదలు, విపత్తులు వచ్చినా… పలు రకాల పేర్లతో డబ్బులు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. టెక్నాలజీతోపాటుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు.
Also Read:Andhra Pradesh Student Suicides: విద్యార్థుల ఉసురు తీసిన అవమానం..
తాజాగా దీపావళిని కూడా టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. తక్కువ ధరకే క్రాకర్స్… హోల్ సేల్ ధరలకే టపాసులు… క్రాకర్స్ కేజీ సేల్స్… అంటూ నకిలీ వెబ్‌సైట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చాయి. వెబ్ సైట్లలో అట్రాక్టివ్ ఆఫర్లను ప్రకటిస్తూ ట్రాప్ చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఏపీకే ఫైల్స్, ఫిషింగ్ లింక్స్‌ను పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు.
దివాళి గిఫ్ట్స్ అని… బ్యాంకుల పేర్లతో దివాళి రివార్డ్ పాయింట్స్ అని.. లింకులు పంపుతున్నారు. అట్రాక్ట్ అయి ఒక్కసారి క్లిక్ చేశామా… అంతే సంగతులు. క్షణాల్లో మన అకౌంట్ గుల్ల అవడం ఖాయం. బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లు చోరీ చేసి అకౌంట్‌లో ఉన్న డబ్బులు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. జస్ట్ రెండు రోజుల్లోనే ఏకంగా 400 మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటికీ బాధితులు సీసీఎస్‌కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. దీపావళి పేరుతో వచ్చే లింకులు, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
