Site icon NTV Telugu

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగులు.. ఫేక్ ఐడీ కార్డు చూపి..!

Telangana Secretariat

Telangana Secretariat

తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. నకిలీ ఉద్యోగుల కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్‌కు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు.

ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నాడు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి, భాస్కర్ రావు కలిసి ఫేక్ ఐడీ కార్డు తయారు చేసుకున్నారు. సెక్రటేరియట్‌లో కీలక మంత్రుల పేర్లు చెప్పి.. పనులు చేయిస్తామని, ఫైల్స్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. వీరి కదలికలపై సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్‌కు అనుమానం వచ్చింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులుకు విషయం చెప్పిన దేవిదాస్‌.. రవి, భాస్కర్ రావులపై ఓ కన్నేయమని ఆదేశించారు.

యూసుఫ్, ఆంజనేయులు కొన్నిరోజులుగా నిఘా పెట్టి.. రవి, భాస్కర్ రావులు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసినట్లు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా ఇద్దరినీ పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు?, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా?, సెక్రటేరియట్‌లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది?, వీరికి ఎవరు సహకరించారు?, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఉద్యోగులు పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవి ఉన్నారు.

Exit mobile version