Matheesha Pathirana Ruled Out of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో చెన్నైకి భారీ షాక్ తగిలింది. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ గాయపడ్డాడు. గతవారం సిల్హెట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండవ టీ20లో అతడికి గాయం అయింది. ప్రస్తుతం పతిరణ జట్టుకు దూరంగా ఉన్నాడు.
తొడకండరాల నొప్పితో మతీశ పతిరణ శ్రీలంక జట్టును వీడాడు. అతడికి దాదాపు 4- 5 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో పతిరణ ఐపీఎల్ 2024లోని మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఒకవేళ అతడు జట్టుకు దూరమైతే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ సీఎస్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ముస్తాఫిజుర్ కూడా బాగా బౌళింగ్ చేస్తాడు. బంగ్లా జట్టులో అతడు కీలక పేసర్‌గా కొనసాగుతున్నాడు.
Also Read: IPL 2024: రోహిత్ శర్మ గొప్ప లీడర్.. కెప్టెన్సీ నుంచి తొలగించడం షాక్‌కు గురి చేసుంటుంది!
21 ఏళ్ల మతీశ పతిరణ ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచ్‌లు ఆడి.. 19 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ట్రోఫీ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో సీఎస్‌కే పతిరణను రిటైన్ చేసుకుంది. ఈ ఏడాది కూడా అతడిపై భారీ ఆశలు పెట్టుకోగా.. ఇంతలోనే గాయం అయింది. న్యూజీలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.