NTV Telugu Site icon

IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!

Ms Dhoni Record

Ms Dhoni Record

2025లో ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ నవంబర్ చివరలో మెగా వేలం నిర్వహిచే అవకాశాలు ఉన్నాయి. మెగా ఆక్షన్‌కు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఇటీవల బీసీసీఐ విడుదల చేసింది. గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఓ ప్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా అన్ని ఫ్రాంఛైజీలు రిటైన్ లిస్టు సమర్పించాల్సి ఉంటుంది. క్రికెట్ అభిమానులంతా ఈ లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్. ఇందుకు కారణం.. టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2025లో ఆడతాడా? లేదా? అని.

2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో మహీ ఆటను చూస్తూ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే ప్రతిసారి ఐపీఎల్‌కు ముందు ధోనీ లీగ్‌లో ఆడతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారుతుంటుంది. ధోనీకి వయసు అయిపోయిందని, శరీరం సహకరించని కారణంగా ఆడకపోవచ్చని వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ఇన్నాళ్లూ ఐపీఎల్ ఆడుతూ వచ్చాడు. ఎప్పటిలానే ఈసారి కూడా ఐపీఎల్‌కు ధోనీ అందుబాటులో ఉంటాడా? అనేది ఎలాంటి క్లారిటీ లేదు.

తాజాగా ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2025కు తాను అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై మహీ ఇప్పటివరకు ఏం చెప్పలేనని తెలిపారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్లో సీఎస్‌కే సీఈఓ మాట్లాడుతూ… ‘చెన్నై జట్టులో ధోనీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ ధోనీ ఇంకా మాకు ఏ సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 31వ లోపు చెప్తానని చెప్పాడు. ధోనీ ఆడతాడని మేము ఆశిస్తున్నాము’ అని తెలిపారు. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డాడు. ధోనీని చెన్నై అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. వచ్చే సీజ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.