Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్‌కే తన కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన ఇద్దరు పాత దిగ్గజాలు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్, భారత్ మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మలను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమిస్తూ చెన్నై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
దాదాపు 16 ఏళ్ల పాటు జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో సీఎస్‌కే బ్యాక్‌రూమ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఫ్లెమింగ్ స్థానంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జహీర్ ఖాన్, తనతో పాటు లీడ్ తీసుకోవడానికి పాత మిత్రులను ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే మైక్ హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సిమన్స్ (బౌలింగ్ కోచ్) జట్టును విడిచిపెట్టగా, జహీర్ ఖాన్‌కు నచ్చిన కోచింగ్ సిబ్బందిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను ఫ్రాంచైజీ ఇచ్చింది. అయితే, గత సీజన్ నుంచి ఫీల్డింగ్ కోచ్‌లుగా ఉన్న జేమ్స్ ఫోస్టర్, శ్రీధరన్ శ్రీరామ్‌లు మాత్రం తమ పదవుల్లోనే కొనసాగుతారు.
స్టేడియంలో చెన్నై ఫ్యాన్స్‌కు అపురూపమైన జ్ఞాపకాలను అందించిన ఆల్బీ మోర్కెల్, మోహిత్ శర్మలకు సీఎస్‌కే ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. 2008 ఐపీఎల్ తొలి సీజన్ నుంచి 2013 వరకు మోర్కెల్ చెన్నై జట్టుకు ప్రధాన బలంగా ఉండేవారు. 2010, 2011లలో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే జట్టులో కీలక పాత్ర పోషించారు. చెన్నై తరఫున 78 మ్యాచ్‌లు ఆడిన మోర్కెల్ 827 రన్స్ చేయడంతో పాటు 76 వికెట్లు తీశారు. SA20 లీగ్‌లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు నేరుగా సీఎస్‌కే డగౌట్‌లో అడుగుపెడుతున్నారు. మరోవైపు 2013లో సీఎస్‌కే ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన మోహిత్ శర్మ, 2014 సీజన్ లో తన స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను దెబ్బకొట్టి అత్యధిక వికెట్లతో ‘పర్పుల్ క్యాప్’ సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 2025లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్, చెన్నై తరఫున 48 మ్యాచ్‌ల్లో 58 వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు వీళ్లిద్దరి రాకతో చెన్నై సూపర్ కింగ్స్ మరింత బలపడి, రాబోయే సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

